Thursday, September 27, 2012

Sri Kanchi Maha Periva Sayings


రామాయణం లో మధుర శ్లోకాలు

      *కార్యసిద్ధికి సుందరాకాండ 39 వ సర్గలోని 4 వశ్లోకం*
       
      *త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ
      హనుమన్ యత్నమాస్థాయ దుఃఖ క్షయ కరోభవ*
      శ్లోకార్థం:

      "ఓ వానరశ్రేష్ఠుడా, ఈ పని (రావణసంహారం/సీతా-రాములు మళ్ళీ కలవటం)
      నెరవేరకుండుటను ప్రత్యక్షంగా చూస్తున్న/చూసిన సాక్షివి నీవు. నీ ప్రయత్నం ప్రారంభించు; దుఃఖనివారకుడవగుము"
      ఇది హనుమ సీతాఅమ్మవారిని లంకలో దర్శించి మళ్ళీ రామునికి వార్త అందివ్వటానికి బయలుదేరే సమయంలో సీతా అమ్మవారు హనుమతో అన్న మాటలు.

      ఈ శ్లోకం మంత్రసమానము (సుందరకాండ అంతా మంత్రమే; అలా దర్శించలేని వారికి ఇలా కొన్ని ప్రత్యేకశ్లోకాలు మంత్రాలుగా చెప్తారు పెద్దలు.)

      దీనిని అమ్మవారి వచనంగా తీసుకుంటే హనుమంతుడికి అనుఙ్ఞాపూర్వక ఆశీస్సు ధ్వనిస్తుంది. మనకున్న సత్సంకల్పాలను భగవంతుని పాదార్పణం చేసి మనం పఠించి హనుమను ప్రార్థస్తే, అభ్య్యర్థనాపూర్వక ప్రార్థన ధ్వనిస్తుంది.
       

Monday, September 24, 2012

గోమాత


వరుణశ్చైవ గోమూత్రే, గోమయే హవ్య వాహనః
దధేవాయుః సముద్దిష్టః సోమః క్షీరేఘ్రుతేరవిః

గో మూత్రంలో వరుణుడు, గోమయంలో అగ్ని, ఆవు పెరుగులో వాయు దేవుడు, ఆవు పాలలో చంద్రుడు, ఆవు నెయ్యిలో సూర్యుడు, ఆవు ముఖంలో, 
యోనివద్ద ఇష్టార్ధ దేవతలు కోలువైయున్నారు.

పూర్వ కాలంలో గోవులేన్ని ఎక్కువ ఉంటె వారే శ్రీమంతులుగా వుండేవారు. గో ధనమే నిజ ధనంగా భావించేవారు.గోధనంలేని రాజ్యం క్షీణిస్తుందనే భావన యుండేది. 

అందుకనే పాండవులకి అరిష్టం కలిగించాలని ఉత్తర గోగ్రహణ (విరాటపర్వం) జరిపిస్తాడు దుర్యోధనుడు.

గో సంతానంలో కొన్ని పొలం దున్ని ఆహారోత్పత్తికై సహాయపడితే, మరికొన్ని పాలను ప్రసాదించి మానవాళికి వాటి ద్వారా రోగనిరోధక శక్తి ప్రసాదిస్తాయి.
గోవును పూజించి ముమ్మారు ప్రదక్షిణ చెస్తే సర్వ పాపాలు హరిస్తాయి.

Thursday, September 20, 2012

సప్తగిరులు



శ్రీశైలం, శేషశైలం, గరుడాద్రి, వేంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి -- అనేవి. పేర్లు ఏదైనా - ఒకే పర్వత సముదాయం
 -- ఇది. యుగాభేదాలతో, వ్యక్తుల పేర్లతో, భక్తుల పేర్లతో, ఈ పర్వతశ్రే ణికి ఏడు పేర్లు ఏర్పడ్డాయి. ఇవేకాక
-- చింతామణి, జ్ఞానాద్రి, ఆనందాద్రి, అంజనాద్రి, నీలాద్రి, వరాహాద్రి, వైకుంఠాద్రి, -- ఇలా
 ఎన్నో సార్థకమైన పేర్లున్నాయి. బ్రహ్మాండపురాణం ఈ పర్వతాలకు 20 పేర్లు పేర్కొనింది.

(1) శ్రీశైలం - శ్రీదేవికి నివాసమై -- భక్తులకు సకల సంపదలు ప్రసాదిస్తుంది కనుక.
(2) శేషశైలం - ఆదిశేషుడే పర్వతంగా రూపొందిన పర్వతం.
(3) గరుడాద్రి - వరాహస్వామి ఆజ్ఞపై గరుత్మంతుడు వైకుంఠం నుండి తెచ్చినందున - గరుడాద్రి.
(4) వేంకటాద్రి - వేం = పాపాలను, కటః = దహింప చేసేది. పాప నాశకమైనది.
వేం = అమ్రుతత్వాన్నీ, కటః = ఐశ్వర్యాన్ని ప్రసాదించేది కనుక - వెంకటాచలం.
(5) నారాయణాద్రి = మునుపు 'నారాయణ' అనే బ్రాహ్మణుడు తపస్సు చేసి, విష్ణుదేవున్ని ప్రత్యక్షం చేసుకొని, '
ఈ క్షేత్రం తన పేరుతో ప్రసిద్ది పొందాలని అర్థించాడు. స్వామి అనుగ్రహించాడు. -- అందువల్ల నారాయణాద్రి.
 సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నివసించి ఉండే స్థానం కనుకనూ నారాయణాద్రి.
(6) వృషభాద్రి - వృషభుడనే శివభక్తుడు శబర వేషంతో ఉన్న శ్రీనివాసునితో యుద్ధం చేసాడు. స్వామి సుధార్శనాయుధంతో అతన్ని సంహరించాడు. మరణిస్తూ అతడు 'ఈ పర్వతం తన పేరుతో ప్రసిద్ధికి రావాలని' కోరాడు కనుక వృషభాద్రి. మరొకటి వృషభుడనే రాక్షసుడు స్వామివారితో యుద్దంచేసి, చక్రాయుధంతో హతుడై మరణిస్తూ 'ఈ పర్వతం తన పేరుతో ఉందా' లని కోరాడు. కనుక వృషభాద్రి.
(7) వృషాద్రి - వృష మంటే ధర్మం. ధర్మ దేవత తన అభివృద్ధికై ఈ పర్వతం పై తపస్సు చేసినందున -- వృషాద్రి.

సుప్రభాతంలో "శ్రీశేషశైల ..... తవ సుప్రభాతం" శ్లోకం ఈ సప్తగిరులను ప్రస్తుతించింది.
20 నామాలను స్మరించే శ్లోకాలు -- బ్రహ్మాండ పురాణం - శ్రీ వెంకటేశ్వర మాహాత్మ్యం - 1 అధ్యాయం 21 నుంచి 23 శ్లోకాలు.

అంజనాద్రి ర్వ్రుశాద్రిశ్చ శేషాద్రి ర్గరుడాచలః |
తీర్థాద్రిః శ్రీనివాసాద్రి శ్చింతామణిగిరిస్తథా ||
వృషభాద్రి ర్వరాహాద్రిః జ్ణానాద్రిః కనకాచలః |
ఆనందాద్రిశ్చ నీలాద్రి స్సుమేరుశిఖరాచలః ||
వైకుంఠాద్రి: పుష్కరాద్రిః -- ఇతి నామాని వింశతిః

ఈ 20 నామాలు పఠించటంవల్ల సర్వ పాప బంధాలు నుండీ విముక్తులు కాగలరు.

Wednesday, November 23, 2011

పోతన - శ్రీమధ్భాగవతము శ్లోకాలు




పలికెడిది భాగవతమఁట
పలికించు విభుండు రామభద్రుండఁట నేఁ
బలికిన భవహరమగు నఁట
పలికెద వేఱొండు గాథ బలుకఁగనేలా.

 

మహాభక్తుడైన పోతన సర్వం దైవాయక్తంగా భావిస్తూ భాగవత గ్రంథ కర్త్తుత్వానికి కూడా ఆ శ్రీరామచంద్రుణ్ణే అధికారిగా నిల్పుతూ చెప్పిన పద్యం ఇది.

చెప్పే గ్రంథమేమో భాగవతం - అంటే భక్తుల చరిత్రమూ, ఆ భక్తులకు కుదురైన శ్రీ హరి చరిత్రమూ. మరి ఆ శ్రీ హరిలీలలు అనంతాలు కదా, అవి వర్ణించడానికి ఎవరికి సాధ్యం? అందుకే పలికించే విభుడు ఆ రామ భద్రుడే! అంటూ వ్యక్తం చేశాడు పోతన. "పలికించు విభుండు రామభద్రుండట" అంటూ చెప్పి పోతన శ్రీ రామచంద్రునికి "విభు" శబ్దంతో జగన్నాయకత్వాన్నీ, "భద్ర" పదంలో లోక రక్షకత్వాన్నీ సంక్రమింపజేస్తూ రామచంద్రుడు సాక్షాత్తు శ్రీ హరే సుమా అంటూ తెలియజేసినాడు. 

అప్పుడు పలికించే ప్రభువు శ్రీ హరికాగా పలికేది శ్రీహరిచరితం అంటే భాగవతం ఐంది. ఇంతకంటే పుణ్యం కానీ, పుణ్య వస్తు సంకీర్తనం కానీ ఇంకేముంటుంది? ఇటువంటి కథను పలకడం వల్ల ఏమిటీ లాభం? అంటే భవహరం, ఇక జన్మ లేకపోవడం. అందుకే పోతన వేరే కథను చెప్పడం ఎందుకూ? సంసార బంధాలు సమసిపోయే ఈ హరికథనే చెబుతానంటూ భాగవతాన్ని ప్రారంభం చేశాడు.



చేతులారంగ శివునిఁ బూజింపఁడేని

నోరునొవ్వంగ హరికీర్తినుడువఁడేని
దయయు సత్యంబులోనుగాఁ దలఁపడేని
గలుగనేటికిఁ దల్లుల కడుపుచేటు.


’చేతులారంగ’ అంటే చేతులనిండుగా తృప్తితో శివపూజ చేయనివాడూ, ’నోరునొవ్వంగ’ అంటే ఎల్లప్పుడూ హరినామ, గుణకీర్తనం చేయనివాడూ, సత్యమూ, దయా మొదలైన మంచి గుణాలను గూర్చి ఆలోచించనివాడూ పుట్టడం కూడా వ్యర్థమే. వాడి జన్మ తల్లికడుపు పంటగా కాకుండా, తల్లికడుపు మంటగా నిలుస్తుంది అంటూ కొంత ఘాటుగానే మందలించినాడు పోతన. 

కలడందురు దీనుల యెడ
కలడందురు పరమయోగి గణములపాలం,
గలడందు రన్ని దిశలను,
గలడు గలం డనెడివాడు గలడో? లేడో?


దీనుల యెడ ఉన్నారంటారు, 
పరమ యోగులందూ ఉన్నాడంటారు, 
నాల్గు దిక్కుల్లోనూ ఉన్నాడంటారు, 
"ఉన్నాడు ఉన్నాడు" అనేవాడసలు ఉన్నాడో? లేడో?

మనిషికి సందేహముండరాదు. ఆ సందేహమే మనిషిని కాకుండా, అతనిపని యేదీ కాకుండా చేస్తుంది.

గజేంద్రుని సందేహం వలనే ఈశ్వరుడు అతని రక్షణకు రాలేక పోయాడన్న విషయాన్ని యీ పద్యం ముఖాన మహాకవి సందేశమిచ్చాడు.
 



ఎవ్వనిచే జనించు జగ మెవ్వనిలోపల నుండు లీనమై,
యెవ్వనియందు డిందు, బరమేశ్వరుఁడెవ్వఁడు, మూలకారణం
బెవ్వఁ, డనాది మధ్యలయుఁ డెవ్వఁడు, సర్వము దానయైన వాఁ
డెవ్వఁడు, వాని నాత్మభవు, నీశ్వరు,నే శరణంబు వేఁడెదన్.


ఈ సృష్టి యంతయు ఒకే ఒక దేవుని వలన పుట్టుచున్నది. ప్రళయ కాలమున వాని యందే లీనమైయుండి, మరల సృష్టికాలము వరకు వానియందే నిద్రించు చుండును. కనుక అన్ని సృష్టులకును పరమేశ్వరుడైనవాడొక్కడె! అతడే కారణముల కన్నింటికిని మూలకారణమైనవాడు. వానికి మొదలు, ఉండుట, అంతరించుట యనునవి లేవు. అతడు తనంతట తానే యుండును. అట్టి ఒకేఒక్క ఈశ్వరుని నేను శరణు వేడుచున్నాను. 


లోకంబులు లోకేశులు
లోకస్థులుఁ దెగినఁ తుది నలోకం బగు పెం
జీకఁటి కవ్వల నెవ్వఁడు -
నేకాకృతి వెలుఁగు నతని నే సేవింతున్.


భూలోకము మొదలు పాతాళము వరకుగల అథోలోకములు, సత్యలోకము వరకుగల ఊర్థ్వలోకములు ఈ సృష్టిలోని భాగములు. కాలగమనములో ఆయా లోకములలోని జీవులు, ఆ లోకములు, ఆ లోకముల కధిపతులైన దేవతలు, చివరకు బ్రహ్మాదులు కూడ సృష్టి పరిణామక్రియలో అంతమై పోవుదురు. ఆ వెనుక నున్నది పెంజీకటి; అనగా దుర్భేద్యమైన చీకటి. అది మాయామయ మగు మూల ప్రకృతి. ఆ మూల ప్రకృతికి కూడ వెనుకగా ఒకే ఒక వెలుగు తనలో తాను వెలుగు చుండును. అట్టి జ్యోతి స్వరూపుడైన దేవుని నేను సేవింతును. 

అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబు దా
పల మందార వనాంతరామృత సరః ప్రాతేందు కాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్న ప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము "పాహి! పాహి" యన గుయ్యాలించి సంరంభియై"


మొసలి పట్టు విడిపించుకోలేని గజరాజు మొఱపెట్టి మొఱపెట్టి, కొంతవరకు సందేహించి, తరువాత దిక్కుతోచక చివరకు "నీవే తప్ప యిత: పరంబెరుగ" నని చేతులెత్తాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు డెలా ఉన్నాడో యీ పద్యం నిరూపిస్తుంది.

వైకుంఠపురంలో ఆమూల సౌధంబు దాపల మందార వనంలో, అమృత సరోవరం ప్రక్కన ఉన్న చంద్రశిలా వేదిపై కలువ పూపాన్పుపై కూర్చున్న ఆపన్న ప్రసన్నుడు గజేంద్రుని మొఱ ఆలకించాడు
 


లా వొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యె బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను, మూర్చ్హ వచ్చె, దనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్

"నీవే తప్ప యితః పరంబెరుగ, మన్నింపందగున్ దీనునిన్
రావే యీశ్వరా! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!"


ఈ పద్యంలో భక్తుడు భగవంతుని చేరే విధానం నిరూపింపబడింది.

నేను చిక్కిపోయాను, ధైర్యం చెదరింది, ప్రాణాలా వాటి స్థానాలు తప్పుతున్నాయి. మూర్చ వచ్చింది, శరీరమంతా డస్సింది, శ్రమయింది, నీవు తప్ప నాకింకెవరూ లేరు.
నా తప్పులు నన్నించు, దీనుడను, రక్షింపగా యీశ్వరా రమ్ము, భద్రాత్మకా;
 


సిరికిం జెప్పడు శంఖ చక్రయుగముం జేదోయి సంధింప డే
పరివారంబు జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణి కాం
తర ధమ్మిల్లము జక్కనొత్తడు వివాదప్రోధ్ధత శ్రీకుచో
పరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై


తన ప్రక్కనున్న శ్రీ దేవికి చెప్పలేదు, శంఖ చక్రాలు ధరించలేదు, పరివారాన్నైనా పిలువలేదు. గరుత్మంతుని కూడా పిలువలేదు. ఇంతెందుకు? సరస పరిహాసాకుశలుడై శ్రీలక్ష్మి పైటచెరగు పట్టుకొని గజేంద్ర రక్షణ కొఱకు లాక్కొని పోతున్నాడు. 

మందార మకరంద మాధుర్యమున తేలు
మధుపంబు వోవునే మదనములకు
నిర్మల మందాకినీ వీచికల తూగు
రాయంచ చనునె తరంగిణులకు

లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు
కోకిల చేరునే కుటజములకు
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం
బరుగునే సాంద్ర నీహారములకు

అంబు జోదర దివ్య పాదారవింద
చింతనామృతపాన విశేషమత్త
చిత్తమేరీతి నితరంబు చేరనేర్చు
వినుత గుణశీల మాటలు వేయునేల.


మందార పుష్పాల మకరంద మాధుర్యం అనుభవించే తుమ్మెద ఉమ్మెత్త పుష్పాలకి పోవగలదా? నిర్మలాతి నిర్మలంగానున్న పరమపావని గగనగంగా తరంగాలలో దేలి అచటగల తామరతూడులను భక్షించు రాజహంస చిన్న మురికిగుంటలవలె నున్న తరంగిణులకు చనునా?

తీయ మామిడి గున్న చిగురుటాకులు తిని ఆనందించు కోయిలమ్మ ఉమ్మెత్త పూవులకు సేరునా? పరిపూర్ణ పూర్ణిమా చంద్రునిలోగల అమృతకిరణాల్ని ఆహారంగా గొను చకోరం దట్టమైన మంచుగడ్డల కరుగునా?

అలాగే శ్రీమహావిష్ణు పాదారవింద ధ్యానామృత పానంతో విశేషమైన మత్తుగల నా చిత్తం యింకొకదానికి చేరుతుందా? చేరదు తండ్రీ!



కమలాక్షు నర్చించు కరములు కరములు
శ్రీ నాధు వర్ణించు జిహ్వ జిహ్వ
సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు
శేషశాయికి మ్రొక్కు శిరము శిరము

విష్ణు నాకర్ణించు వీనులు వీనులు
మధువైరి తవిలిన మనము మనము
భగవంతు వలగొను పదములు పదములు
పురుషోత్తముని మీది బుధ్ధి బుధ్ధి

దేవ దేవుని చింతించు దినము దినము
చక్ర హస్తుని ప్రకటించు చదువు చదువు
కుంభినీధవు చెప్పెడు గురుడు గురుడు
తండ్రి హరి జేరుమనియెడి తండ్రి తండ్రి!


దానవేంద్రా!

హరి సేవకు నోచుకోని శరీరం వున్నదే అది గాలి నింపిన తోలుతిత్తి. విష్ణు సంకీర్తనం ఎరుగని నోరు ఢం ఢం ధ్వని చేసే ఢక్క. హరిని పూజించని హస్తాలు కర్రతో చేసిన గరిటెలు.

కమలావతిని చూడని కన్నులు శరీరమనే గోడకు కొట్టిన కన్నాలు. శ్రీ పతిని గిరించి యోచించని జన్మ గాలిబుడగ. విష్ణుభక్తి ఎరుగని విధ్వాంసు డున్నాడే వాడు ద్విపాద పశువు.


శ్రీ కైవల్య పడంబున్ జేరుటకునై చింతించెదన్, లోక ర

క్షైకారంభకు, భక్త పాలన కళా సంరంభకున్, దానవో
ద్రేక స్తంభాకున్, గేళి లోల విలసద్ద్రుగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు, మహానందాంగనా డింభకున్ 

వాలిన భక్తి మ్రొక్కెద నవారిత తాండవ కేళికిన్ దయా
శాలికి శూలికిన్ శిఖరిజా ముఖపద్మ మయూఖ మాలికిన్
బాల శశాంక మౌళికిన్ గపాలికి మన్మధ గర్వ పర్వతో 
న్మూలికి నారదాది ముని ముఖ్య మస్సరసీరుహాలికిన్ 

ఆతత సేవన్ జేసేద సమస్త చరాచర భూత సృష్టి వి 
జ్ఞాతకు భారతీ హృదయసౌఖ్య విధాతకు వేద రాశి ని 
ర్ణేతకు దేవతా నికర నేతకున్ గల్మషజేతకున్ నాథ 
త్రాతకు ధాతకున్ నిఖిల తాపస లోక శుభ ప్రదాతకున్ 


అమ్మలగన్న  యమ్మ  ముగురమ్మల  మూలపుటమ్మ  చాల  పెద్దమ్మ  సురారులమ్మ  కడుపారడి  పుచ్సినయమ్మ  తన్ను  లో 
నమ్మిన  వేల్పుటమ్మల  మనమ్ముల  నుమ్డేది  యమ్మ  దుర్గ  మా  యమ్మ  క్ర్పబ్ది  యివుట  మహత్వ  కవిత్వ  పటుత్వ  సంపదల