Friday, October 31, 2014

కార్తిక దామోదర


​​
కార్తికమాసం ఆకాశదీపంతో ప్రారంభమవుతుంది. నిజానికి ఏవి ఆకాశదీపాలు. మీరు నేను పెట్టక్కరలేదు. ఆకాశదీపాలు వెలిగించినవాడు పరమేశ్వరుడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవీ ఆకాశదీపాలు. మరి కార్తికమాసం ప్రారంభం దేంతో మొదలు? ఆకాశదీపంతో ప్రారంభం. ఆకాశదీపం ఎక్కడ వెలిగిస్తారు? దేవాలయంలో వెలిగిస్తారు. దేవాలయంలో ధ్వజ స్తంభానికి తాడుకట్టి ఒక చిన్న పాత్రలో దీపం వెలిగించి, గాలికి నిధనం కాకుండా రంధ్రములతో ఏర్పాటు చేసి దాన్ని జాగ్రత్తగా శమంతకంగా భగవంతుని నామాలు చెపుతూ, భక్తులందరూ చుట్టూ నిలబడి ఉండగా, ఆ దీపాన్ని పైకెత్తుతారు. ఎవరి శక్తి కొలదీ వాళ్లు తగినట్లుగా వారు కార్తిక మాసంలో భక్తులు ఆకాశదీపానికి చమురో, వత్తులో ఇస్తూ ఉంటారు. ఆ దీపాన్ని పైకెత్తుతారు ఎందుకని? ఆ దీపం ధ్వజస్తభంం మీద ఉండి అంతటా వెలుతురు చిమ్ముతుంది. ధ్వజస్తంభం మీదకి ఏదైనా లాగారు అంటే, పతాకాన్ని ఆరోహణ చేశారు అంటే ఈశ్వరునికి ఉత్సవం అవుతుందని గుర్తు. ఇంకా కార్తికమాసంలో మనమే ఉత్సవం చేస్తున్నాం. మనకి మనం ఉత్సవం. ఉత్‌ అంటే తలపైకెత్తడం, తల పైకెత్తి చూశాడు కాబట్టి ఉత్సవం. ఏమిటి తల పైకెత్తి చూడ్డం? నాకు ఉన్న గౌరవం ఏమిటి? ఈ శరీరంలో ఉంటూ నేను చేయగలిగిన అధికారం ఏమిటి? సమస్త భూతాలకు నేను మహోపకారం చేయగలను కార్తికపౌర్ణమి నాడు. ఇతర ప్రాణులు చేయలేవు. నేనే చేయగలను. ఏమిటి చేయగలను? దీపం తీసుకెళ్లి ఓ గదిలో పెట్టాననుకోండి కొంత ఫలితం. వీధిలోకి తీసుకువచ్చి దీపం పెట్టాననుకోండి విశేషఫలితం. అందుకే గుత్తు దీపాలని పెడతారు. ఇంతంత వత్తులు వేసి కట్టకట్టి దీపం వెలిగిస్తారు ఆ రోజున. యథార్థానికి శాస్త్రంలో ఏమి చెప్పారంటే ఆ రోజున చెత్త కూడా వెలిగించాలి. వీధులలో ఉన్న చెత్త కూడా వెలిగించేసేయమన్నారు. కానీ లౌకికాగ్నితో వెలిగించకూడదు. మీ ఇంట దీపం వెలిగించి కార్తిక పౌర్ణమి నాటి ప్రదోషవేళ, దామోదరమావాహయామి అనిగాని, త్రయంబకమావాహయామి  అనిగాని అని, ఆ దీపంతో వెలిగించాలి. ఈ దీపం పెట్టి ఒక్కసారి ఆకాశం వంక చూసి ఒక శ్లోకం చెప్పాలి. 

కీటాఃపతంగాః మశకా శ్చ వృక్షాః
జలేస్థలే... ఫలే ఏ నివసంతి
జీవా దృష్ట్యా ప్రదీపం నచ జన్మ భాగినః
భవతింత్వ స్వపచాహి విప్రాః 



ఈ శ్లోకం చెప్పి నమస్కారం చేయాలి. ఇప్పుడు నువ్వు నమస్కారం చేస్తే పరమేశ్వరుడు ఎంతో ఆనందాన్ని పొందుతాడు. ఒరేయ్‌ వీడికి నేను మనుష్య శరీరాన్నిస్తే వీడు ఇన్ని భూతాలలో ఉన్న విభూతులను వాడుకున్నాడు. ఇన్నిటిని వాడుకున్నందుకు ఇవాళ వీడు ప్రత్యుపకారం చేశాడు. ఈ ఉపకార బుద్ధి, కృతజ్ఞత ఉన్నవాడు కాబట్టి నా మాట నమ్మి ఉపకారం చేశాడు. కాబట్టి వీడికి నేను మళ్లీ మనుష్యు శరీరం ఇవ్వవచ్చు. ఈ మాట చెప్పినపుడు ‘కీటాఃపతంగాః మశకాశ్చ వృక్షాః’ కీటకములుంటాయి. చిన్నచిన్న పురుగులు. అవి ఎందుకు పుడతాయంటే దీపంలో పడి చచ్చిపోవటానికి పుడతాయి. వాటివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే నాకేం ఉండదు. బల్లులకుంటుంది. పురుగులను పట్టి తింటాయి. ఇతర భూతములకు ఆహారమై పోతాయి. అధవా వాటి ఆయుర్ధాయం దేనివల్ల నశించిపోతుంది. ఆ దీపం యొక్క జ్యోతి మీద కొంచెంగా పడిపోతాయి. కింద పడిపోయి వాటి రెక్కలు వూడిపోతాయి.
అటువంటి దీపపు పురుగులు దీపం మీద పడి కాలిపోవడం చచ్చిపోవడమే తప్ప అభ్యున్నతి పొందినది లేదు. ఆ దీపం వల్లనే అని తెలిస్తే కదూ! పైగా దీపంలో ఎక్కువగా పడిపోతే దీపం నిధనమైన పాపం వస్తుంది వాటికి తప్ప, దీపం వల్ల ప్రయోజనం పొందలేదు. అని ఇవాళ ఈశ్వరా నేను ఒక సంకల్పం చెప్తున్నాను, ఈ దీపం దీపం కాదు, ఇది త్రయంబకుడు, ఇది దామోదరుడు, కాబట్టి దీనివల్ల మొదటి ఫలితమెవరికి వెళ్లాలంటే కీటాఃపతంగాః మశకాశ్చ, కీటకములు: పురుగులు, పతంగాలు, మశకాశ్చ: దోమలు, వృక్షాః అవి యెంతో ఉపకారం చేస్తాయి. కాయలిస్తాయి, పళ్లు ఇస్తాయి. ఆకులిస్తాయి, కొమ్మలిస్తాయి, రెమ్మలిస్తాయి, కలపనిస్తాయి, ఇళ్లు కట్టుకుంటాం. ఇన్ని చేస్తాం. కానీ ఎండలో అది నిలబడి మనకు నీడనిస్తుంది తప్ప దాని జన్మాంతరంలో అది మాత్రం ఎక్కడికీ వెళ్లలేదు. అలాగే ఉండాలి. ఒక ఆవు వచ్చి దాని కొమ్మలు కొరుక్కు తినేస్తున్నా, ఒక ధూర్తుడు వచ్చి కొమ్మ విరిచేస్తున్నా, ఏవో ప్రాణులొచ్చి దాని మీద కెక్కి అలజడి చేసేసేఇ కొమ్మలన్నీ వొంచేస్తున్నా, గొడ్డలి పెట్టి తనను నరికేస్తున్నా, ఒక్క అడుగు ఇలా తీసి, అలా వేయలేని దైన్యం చెట్టుది. అదలాగే నిలబడుతుంది. ఆ చెట్టు ఎలా అభ్యున్నతిని పొందుతుంది. కదలలేనపుడు, కర్మ లేనపుడు, దానికి కర్మాధికారం ఏది? అది సంపాదించుకోలేదు. కాబట్టి ఈశ్వరా! నీ దీపపు వెలుతురు ఆ చెట్టుమీద పడుతోంది. కాబట్టి దామోదరుడి చేయి దానిమీద పడినట్టే! త్రయంబకుని చేయి దానిమీద పడినట్టే! అది అభ్యున్నతిని పొందాలి.
నీటిలో ఉండే చేపలుంటాయి, కప్పలుంటాయి, తాబేళ్లుంటాయి. ఈ దీపపు వెలుతురు నీటిమీద పడినపుడు, నీటి లోపల ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా నీ అనుగ్రహాన్ని పొందాలి. అక్కడితో సరిపోతుందా? ఇది కాదు. జలేస్థలే నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచజన్మ భాగినః వాటికేం తెలియదు. అవేం పుణ్యం చేయలేదు,. కానీ ఈ వెలుతురు వాటిమీద పడిన కారణం చేత ఇక వాటికి జన్మ లేకుండుగాక! అక్కడితో వాటికున్నటువంటి పాప పుణ్యాలన్నీ కూడా నశించిపోవుగాక! అని భవతింత్వ శపచాపవిప్రాః అసలు వేదం మీద నమ్మకం లేకుండా కేవలం ప్రాపంచిక కర్మాచరణము మాత్రమే చేస్తూ ఈ లోకంలో తిరుగుతూ కేవలం ఉదర పోషణార్థమే బతుకుతున్న భయంకరమైన స్థితిలో ఉండిపోయిన వాడిమీద ఈ దీపం యొక్క కాంతి ప్రసరించిన కారణం చేత వాడుకూడా వచ్చే జన్మలో వేదము యొక్క ప్రమాణం తెలుసుకున్న వాడై స్వరంతో వేదాన్ని చదువుకొని వేదాన్ని ప్రచారం చేసి వేదానికి చేతులడ్డుపెట్టి లోకోద్ధరణ చేయగలిగిన నిస్వార్థతపూరితమైన లోకోపకారియైున బ్రాహ్మణుడిగా జన్మించి అభ్యున్నతిని పొందుగాక! కాబట్టి భవంతిత్వం స్వపచాహివిప్రా: ఈ దీపపు కాంతి అంత గొప్పది. కాబట్టి ఈశ్వరా, నీ యందు త్రయంబకుణ్ణి, దామోదరుణ్ణి అవాహన చేసి ఈ దీపపు వెలుతురు నీయందు ప్రసరించేటట్లు చేస్తున్నాను.
అందుకే కార్తిక పౌర్ణమి నాడు అన్ని చోట్లా దీపాలెత్తుతారు. ఇక దీపమెత్తని ప్రదేశముండదు.


గోమాత  స్తుతి

 కార్తీక శుద్ధ అష్ఠమి గోష్టాష్ఠమి  - గోసేవ కు అంత్యంత విశిష్ట తిధి. 
 ఈ రోజు గోపూజ చేసి,  ఈ క్రింది నామాలతో అర్చించి, స్తోత్రం చేసి (శ్రీ నాగేంద్ర గారు సేకరించి పంపారుసాక్షాత్తు  ఆపరదేవతా స్వరూపమైన గోవుకు గ్రాసం తినిపించిగోమాత అనుగ్రహానికి పాత్రులయ్యే అత్యంత విశిష్ఠ మైన తిథి

                కపిల పూజ స్తోత్రం - అగ్ని పురాణం డెభ్భయ్యేడో అధ్యాయం
ఈశ్వర ఉవాచ:ఓం కపిలే నమో నమః
 ఓం కపిలే భద్రికే నమః
ఓం కపిలే సుశీలే నమః
ఓం కపిలే సురభి ప్రభే !
ఓం కపిలే సుమనసే నమః
ఓం కపిలే భుక్తి ముక్తి ప్రదే నమః!!
సౌరభేయి జగన్మాతర్దేవానామమృతప్రదేగృహాణ వరదే గ్రాసమీప్సితార్థం చ దేహిమే!!వన్దితాస వసిష్ఠేన విశ్వామిత్రేణ ధీమతాకపిలే హర మే పాపం యన్మయా దుష్కృతం కృతమ్!!గావో మమాగ్రతో నిత్యం గావం పృష్ఠత ఏవ గావో మే హృదయే చాపి గవాం మధ్యే వసామ్యహమ్!!రత్తం గృహ్ణస్తు మే గ్రాసం జప్త్యాస్యాం నిర్మలః శివః!గోస్తుతి :
 " దేవతలకు అమృతమునిచ్చుతల్లీ గోమాతా!వరముల నిచ్చు గోమాతానీవు జగన్మాతవు,
సౌరభేయీ గ్రాసమును ప్రీతితో స్వీకరించి నా మనోవాంఛితములనిమ్ము.
 కపిలాగొప్పవారైన బ్రహ్మర్షి వశిష్ఠుడుబ్రహ్మర్షి విశ్వామిత్రులచే పూజలందుకొనినదానవు.
నేను అల్పుడను,   దుష్కార్యాలు చేసానో వానివల్ల కలిగిన పాపములను హరింపుము.గోవులు సర్వదా నాముందునావెనుకనాహృదయమున నివసించు గాక.   
నేను సర్వదా గోవుల మధ్య నివసింతునుగాక.
 గోమాతానేనిచ్చిన  గ్రాసమును స్వీకరింపుము".


 విధముగా ఎవరు గోమాతను స్తుతించి పూజించెదరో వారు అనఘులై
(
పాపరహితులైశివస్వరూపులగుదురు.

Wednesday, June 25, 2014

సాత్విక జీవనము సాగించవలెనన్న చేయవలసిన సాధన ఏమిటి?


దేన్ని గుర్తిస్తే అదే మనలో బలపడుతుంది. ఇది సృష్టి ధర్మం. దైవాన్ని గుర్తిస్తే? అదే బలపడుతుంది. జగత్తుని గుర్తిస్తే? జగత్తే బలపడుతుంది. జీవుడిని గుర్తిస్తే? జీవుడే బలపడతాడు.
సత్వగుణముతో జీవించవలెనన్న ప్రతి పనికి, ఆలోచనకు ముందు విచారణ చెయ్యాలి. విచారణ చెయ్యాలన్న నీవు బుద్ధి స్థానమునందు ఉండాలి. ఎప్పుడూ ఆస్థానం లో నిలబడి ఉండి, సత్వగుణంతో ఈ పనిని చేయటం ఎట్లా? ఈ ఆలోచనను చేయటం ఎట్లా? అని మొదట ప్రశ్న వేసికోవాలి, అప్పుడు నీవు సత్వ ...గుణాన్నే గుర్తు పడతావు. సత్వగుణము నీలో బలపడుతుంది. చాలామంది గుణములను గుర్తించండి అంటే తనలో ఉన్న గుణములను గుర్తిస్తారు. తనలో అజ్ఞానముతో జీవిస్తున్నప్పుడు తమో, రజోగుణములే పనిచేస్తూ ఉంటాయి. వాటిని గుర్తిస్తే ఏమి బలపడతాయి? అవే బలపడుతాయి.(సాధన ప్రారంభములో రజో, తమోగుణములను గుర్తించుట ఆవశ్యకము. వాటినుండి బయటపడుటకు ఆ లక్షణములకు వ్యతిరేఖమైన లక్షణములతో వ్యవహరించుట తప్పదు. కాని సాధనలో కొంత ముందుకు పురోగమించిన తరువాత సత్వగుణముతో వ్యవరిస్తున్నానా లేదా అనునది పరిశీలించుకొనిన చాలు. రజో, తమోగుణములతో వ్యవహరిస్తున్నాను అనుట కన్నా సత్వగుణముతో వ్యవహరించలేదు అనుట మేలు) కనుక నువ్వు గుర్తించాల్సింది సత్వగుణమును. అంటే ప్రతిపనిని సాత్వికదృష్టితో ఆచరించుట ఎట్లా అనునది అలవరచుకోవాలి.
సత్వ గుణాన్ని మాత్రమె గుర్తిస్తున్నప్పుడు సత్వగుణం బలపడితే ఆ సత్వగుణ బలం ఆధారంగా నువ్వు దైవం నేను అనుకునే అవకాశం ఉంది. రజోగుణ బలాన్ని గనుక నువ్వు ఆధారంగా తీసుకున్నట్లు అయితే, జీవుడు నేనుగా ఉండి పోతావు. తమో గుణం బలం ఆధారంగా తీసుకుని ఉండి పోతే జగత్తు నేనుగా ఉండి పోతావు.
ఒక్క నేనే తమో గుణ బలాన్ని స్వీకరించి నప్పుడేమో జగత్తు నేనుగా ఉన్నాడు
రజోగుణ బలాన్ని స్వీకరించి నప్పుడు జీవుడు నేనుగా ఉన్నాడు
సత్వ గుణ బలాన్ని ఆధారంగా చేసుకున్నప్పుడు దైవం నేనుగా ఉన్నాడు.

Tuesday, April 29, 2014

ఆచమనం


మనం చేసే ఆచమనంలో వైదికాంశాలతోపాటు వైజ్ఞానిక రహస్యాలు కూడా ఇమిడి ఉన్నాయి.
మన గొంతులో 'స్వరపేటిక' అనే శరీర అంతర్భాగం వుంటుంది. మనం చేసే ధ్వనులు అంటే మన మాటలు స్వరపేటిక నుండే పుడతాయి. మన ధ్వని గాంభీర్యానికి, స్పష్టతకు ఈ స్వరపేటికే ఆ ధారం.
స్వరపేటికలోకి గాలి జొరబడినప్పుడు అంటే మన శ్వాసకోశాల నుండి వెలువడే ఉచ్ఛ్వాస వాయువు ధ్వని తంతులమీదుగా పయనించినప్పుడు, ఈ ధ్వని తంతువులలో ఏర్పడిన శబ్దాలు బయటకు రావడానికి నోరు, ముక్కు రంధ్రాలు సహాయపడతాయి. అదేవిధంగా నాలుక పెదవులు శబ్దాల ఉచ్ఛారణకు, స్పష్టతకు దోహదం చేస్తాయి.
ప్రతి అక్షరానికి తనదైన ధ్వని ఉంటుంది. నోటిలోని అవయవాలు కదులుతూ ఈ ధ్వనులను ఉత్పత్తి చేస్తాయి. ఈ ధ్వని (అక్షరం) ఏ భాగం నుండి ఉత్పత్తి అవుతుందో దాని ఆధారంగా అక్షరాలను కాంఠ్యాలు, తాలవ్యాలు మొ|| గా విభజించారు.
ఇక మనం వైదిక కర్మలను ఆచరించేటప్పుడు చేసే ఆచమనం వలన మన నాలుకకు, గొంతుకు ఒకరకమైన ఉత్తేజం కలుగుతుంది. అంతేకాకుండా మన గొంతునుండి మాట బయటకు వచ్చేటప్పుడు, ధ్వనితోపాటు గొంతు నుండి వాయువు కూడా బయటకు వస్తుంది. ఈ విధంగా లోపలి నుండి వాయువు బయటకు వచ్చేటప్పుడు ఎలాంటి అడ్డంకి లేకుండా ఉండేందుకు ఆచమనం ద్వారా మనం త్రాగే నీరు ఉపయోగపడుతుంది. నిర్దిష్ట పరమాణంలో మనం తీసుకున్న నీరు గొంతు నుండి వెలుపలివైపు మార్గాన్ని నునుపుగా చేసి మన మాట సులభంగా, స్పష్టంగా వచ్చేందుకు దోహదం చేస్తుంది.
పూజాది వైదిక కార్యాలను ఆచరించేటప్పుడు మంత్రోచ్చారణ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఆయా మంత్రాలన్నీ గొంతునుండి ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చేందుకే మన మహర్షులు ఈ ఆచమన సంప్రదయాన్ని ఏర్పరచారు.
ఇక ఆచమనంలో కేశవాది నామాలను ఉచ్చరించడంలో కూడా ఎంతో వైజ్ఞానిక అంశం ఇమిడి ఉంది. ఆచమనంలో ముందుగా "కేశవాయస్వాహా: అని చెప్పుకుంటారు. 'కే" శబ్దము గొంతునుండి పుడుతుంది. తర్వాత పలికే "నారయణస్వాహా" అనే నామము నాలుక నుండి వస్తుంది. ఇక మూడవసారి చెప్పుకునే "మాధవాయస్వాహా" అనే పదము పెదవుల సహాయంతో పలుక బడుతుంది. కాబట్టి కేశవాది నామాలను పలకడం వలన గొంతుకు, నాలుకకు, పెదవులకు ఒకేసారి వ్యాయామం కలుగుతుంది మరియు ఆ తరువాత వచ్చే శబ్దాలకు ఉచ్చారణ కూడా స్పష్టంగా ఉంతుంది.
మన శరీరము ఒక విద్యుత్ కేంద్రములాంటిది. మన శరీరమంతా విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది. ఆచమన సమయంలో మనం అరచేతిలో తక్కువ ప్రమాణంలో నీటిని వేసుకున్నప్పుడు ఎలక్ట్రో మాగ్నిటిజమ్ పద్ధతిలో అరచేతిలో ఉన్న నీరు పీల్చుకొంటుంది. ఈ నీటిని త్రాగినప్పుడు, నీరు జీర్ణకోశమును చేరి, అక్కడి గోడలలో ప్రవహించే విద్యుత్తుతో కలిసి, శరీరమంతా ఒకే క్రమపద్ధతిలో విద్యుత్తు ప్రవహించేలాగా చేస్తుంది. ఇలా విద్యుత్తీకరణము చెందిన నీరువల్ల గొంతు, నాలుక, స్వరపేటిక మొ|| భాగాలు కూడా ఉత్తేజము పొందుతాయి.
ఇంతటి వైజ్ఞానికాంశాలు ఇమిడి ఉన్నాయి కాబట్టే, మన మహర్షులు ఆచమనాన్ని ఒక తప్పనిసరి వైదిక నియమంగా ఏర్పరిచారు.
(శ్రీశైలప్రభ, ఏప్రియల్ 2014)