Wednesday, June 25, 2014

సాత్విక జీవనము సాగించవలెనన్న చేయవలసిన సాధన ఏమిటి?


దేన్ని గుర్తిస్తే అదే మనలో బలపడుతుంది. ఇది సృష్టి ధర్మం. దైవాన్ని గుర్తిస్తే? అదే బలపడుతుంది. జగత్తుని గుర్తిస్తే? జగత్తే బలపడుతుంది. జీవుడిని గుర్తిస్తే? జీవుడే బలపడతాడు.
సత్వగుణముతో జీవించవలెనన్న ప్రతి పనికి, ఆలోచనకు ముందు విచారణ చెయ్యాలి. విచారణ చెయ్యాలన్న నీవు బుద్ధి స్థానమునందు ఉండాలి. ఎప్పుడూ ఆస్థానం లో నిలబడి ఉండి, సత్వగుణంతో ఈ పనిని చేయటం ఎట్లా? ఈ ఆలోచనను చేయటం ఎట్లా? అని మొదట ప్రశ్న వేసికోవాలి, అప్పుడు నీవు సత్వ ...గుణాన్నే గుర్తు పడతావు. సత్వగుణము నీలో బలపడుతుంది. చాలామంది గుణములను గుర్తించండి అంటే తనలో ఉన్న గుణములను గుర్తిస్తారు. తనలో అజ్ఞానముతో జీవిస్తున్నప్పుడు తమో, రజోగుణములే పనిచేస్తూ ఉంటాయి. వాటిని గుర్తిస్తే ఏమి బలపడతాయి? అవే బలపడుతాయి.(సాధన ప్రారంభములో రజో, తమోగుణములను గుర్తించుట ఆవశ్యకము. వాటినుండి బయటపడుటకు ఆ లక్షణములకు వ్యతిరేఖమైన లక్షణములతో వ్యవహరించుట తప్పదు. కాని సాధనలో కొంత ముందుకు పురోగమించిన తరువాత సత్వగుణముతో వ్యవరిస్తున్నానా లేదా అనునది పరిశీలించుకొనిన చాలు. రజో, తమోగుణములతో వ్యవహరిస్తున్నాను అనుట కన్నా సత్వగుణముతో వ్యవహరించలేదు అనుట మేలు) కనుక నువ్వు గుర్తించాల్సింది సత్వగుణమును. అంటే ప్రతిపనిని సాత్వికదృష్టితో ఆచరించుట ఎట్లా అనునది అలవరచుకోవాలి.
సత్వ గుణాన్ని మాత్రమె గుర్తిస్తున్నప్పుడు సత్వగుణం బలపడితే ఆ సత్వగుణ బలం ఆధారంగా నువ్వు దైవం నేను అనుకునే అవకాశం ఉంది. రజోగుణ బలాన్ని గనుక నువ్వు ఆధారంగా తీసుకున్నట్లు అయితే, జీవుడు నేనుగా ఉండి పోతావు. తమో గుణం బలం ఆధారంగా తీసుకుని ఉండి పోతే జగత్తు నేనుగా ఉండి పోతావు.
ఒక్క నేనే తమో గుణ బలాన్ని స్వీకరించి నప్పుడేమో జగత్తు నేనుగా ఉన్నాడు
రజోగుణ బలాన్ని స్వీకరించి నప్పుడు జీవుడు నేనుగా ఉన్నాడు
సత్వ గుణ బలాన్ని ఆధారంగా చేసుకున్నప్పుడు దైవం నేనుగా ఉన్నాడు.