Thursday, September 20, 2012

సప్తగిరులు



శ్రీశైలం, శేషశైలం, గరుడాద్రి, వేంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి -- అనేవి. పేర్లు ఏదైనా - ఒకే పర్వత సముదాయం
 -- ఇది. యుగాభేదాలతో, వ్యక్తుల పేర్లతో, భక్తుల పేర్లతో, ఈ పర్వతశ్రే ణికి ఏడు పేర్లు ఏర్పడ్డాయి. ఇవేకాక
-- చింతామణి, జ్ఞానాద్రి, ఆనందాద్రి, అంజనాద్రి, నీలాద్రి, వరాహాద్రి, వైకుంఠాద్రి, -- ఇలా
 ఎన్నో సార్థకమైన పేర్లున్నాయి. బ్రహ్మాండపురాణం ఈ పర్వతాలకు 20 పేర్లు పేర్కొనింది.

(1) శ్రీశైలం - శ్రీదేవికి నివాసమై -- భక్తులకు సకల సంపదలు ప్రసాదిస్తుంది కనుక.
(2) శేషశైలం - ఆదిశేషుడే పర్వతంగా రూపొందిన పర్వతం.
(3) గరుడాద్రి - వరాహస్వామి ఆజ్ఞపై గరుత్మంతుడు వైకుంఠం నుండి తెచ్చినందున - గరుడాద్రి.
(4) వేంకటాద్రి - వేం = పాపాలను, కటః = దహింప చేసేది. పాప నాశకమైనది.
వేం = అమ్రుతత్వాన్నీ, కటః = ఐశ్వర్యాన్ని ప్రసాదించేది కనుక - వెంకటాచలం.
(5) నారాయణాద్రి = మునుపు 'నారాయణ' అనే బ్రాహ్మణుడు తపస్సు చేసి, విష్ణుదేవున్ని ప్రత్యక్షం చేసుకొని, '
ఈ క్షేత్రం తన పేరుతో ప్రసిద్ది పొందాలని అర్థించాడు. స్వామి అనుగ్రహించాడు. -- అందువల్ల నారాయణాద్రి.
 సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నివసించి ఉండే స్థానం కనుకనూ నారాయణాద్రి.
(6) వృషభాద్రి - వృషభుడనే శివభక్తుడు శబర వేషంతో ఉన్న శ్రీనివాసునితో యుద్ధం చేసాడు. స్వామి సుధార్శనాయుధంతో అతన్ని సంహరించాడు. మరణిస్తూ అతడు 'ఈ పర్వతం తన పేరుతో ప్రసిద్ధికి రావాలని' కోరాడు కనుక వృషభాద్రి. మరొకటి వృషభుడనే రాక్షసుడు స్వామివారితో యుద్దంచేసి, చక్రాయుధంతో హతుడై మరణిస్తూ 'ఈ పర్వతం తన పేరుతో ఉందా' లని కోరాడు. కనుక వృషభాద్రి.
(7) వృషాద్రి - వృష మంటే ధర్మం. ధర్మ దేవత తన అభివృద్ధికై ఈ పర్వతం పై తపస్సు చేసినందున -- వృషాద్రి.

సుప్రభాతంలో "శ్రీశేషశైల ..... తవ సుప్రభాతం" శ్లోకం ఈ సప్తగిరులను ప్రస్తుతించింది.
20 నామాలను స్మరించే శ్లోకాలు -- బ్రహ్మాండ పురాణం - శ్రీ వెంకటేశ్వర మాహాత్మ్యం - 1 అధ్యాయం 21 నుంచి 23 శ్లోకాలు.

అంజనాద్రి ర్వ్రుశాద్రిశ్చ శేషాద్రి ర్గరుడాచలః |
తీర్థాద్రిః శ్రీనివాసాద్రి శ్చింతామణిగిరిస్తథా ||
వృషభాద్రి ర్వరాహాద్రిః జ్ణానాద్రిః కనకాచలః |
ఆనందాద్రిశ్చ నీలాద్రి స్సుమేరుశిఖరాచలః ||
వైకుంఠాద్రి: పుష్కరాద్రిః -- ఇతి నామాని వింశతిః

ఈ 20 నామాలు పఠించటంవల్ల సర్వ పాప బంధాలు నుండీ విముక్తులు కాగలరు.

No comments: